మాయలు ఫకీరు కథ - మాయలు మంత్రాల అద్భుత జానపద కథ
క్రితం భాగంలో మనం అరణ్య మధ్యంలో ఉంటున్న బాలనాగమ్మ అక్కాచెల్లెళ్ళను వారి మేనమామ రామవర్థిరాజు చూసి, వారిని తన రాజ్యానికి తీసుకువెళ్ళడం, ఆ ఏడుగురికీ తన ఏడుగురు కుమారులనిచ్చి వివాహం చేయడం, వర్థిరాజులంతా గండికోట యుద్ధానికి వెళ్ళిన సమయంలో మాయలఫకీరు సాధువురూపంలో వచ్చి బాలనాగమ్మను ఎత్తుకుపోవడం, ఆమెను రక్షించడానికి వెళ్ళిన ఆమె భర్త, మామగారు, బావగార్లను ఆ మాంత్రికుడు శిలలుగా మార్చివెయ్యడం, బాలనాగమ్మ ఆ మాయలఫకీరు బారినుండి తప్పించుకోవడం కోసం, తాను వ్రతంలో ఉన్నానని చెప్పి పద్నాలుగు సంవత్సరాల గడువుకోరడం, అందుకు ఫకీరు సరే అనడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం.
ఇదిలా ఉండగా అక్కడ పానుగంటిపురంలో బాలనాగమ్మ అక్కలు తమ చెల్లెలి కుమారుడైన బాలవర్థిరాజును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయసాగారు. వారు అతడిని ఎంత అపురూపంగా పెంచసాగారంటే.. అతనికి ఆ ఆరుగురూ తన తల్లులే అన్న భావన ఉండేది. మీలో నా తల్లి ఎవరు? అన్న మాటగాని, తన తండ్రులగురించిన ప్రస్థావన కానీ అతనెన్నడూ తీసుకురాలేదు. అలాగే ఆ బాలవర్థిరాజు గురువుల వద్ద సకల విద్యలనూ అభ్యసించసాగాడు. తోటి విద్యార్థులలోకెల్లా చురుకైనవాడిగా, బుద్ధిమంతుడుగా, సాహసవంతుడుగా పేరు గడించాడు. అలా అతగాడు తన పద్నాలుగవ యేట ప్రవేశించాడు. ఒకనాడు బాలవర్థిరాజు తన స్నేహితులతో కలసి ఆటలాడుతున్నాడు. ఆ సమయంలో ఒక పడుచు నీటి కుండ తలమీద పెట్టుకుని అటుగా వెళ్ళసాగింది. అప్పుడొక స్నేహితుడు బాలవర్థిరాజుతో.. “మిత్రమా! అదిగో ఆ వెళుతున్న పడుచు నెత్తిమీదనున్న కుండను రాయితో కొట్టాలి. ఆ రాయి ఇటువైపునుండి అటుపైపుకు దూసుకుపోవాలి. రెండు వైపులా చిల్లులు పడాలి కానీ కుండ మాత్రం పగుల కూడదు.” అని పందెం వేశాడు. సరే అన్న బాలవర్థిరాజు ఒక రాయి తీసుకుని ఒడుపుగా విసిరాడు. ఆ రాయి కుండ వెనుకపైపు రంధ్రం చేసుకుని దూసుకుపోయి మరలా ముందువైపు కూడా రంధ్రం చేసి బయటకొచ్చింది. రెండు రంధ్రాల నుండీ ధారాళంగా నీళ్ళు కారసాగాయి కానీ.. కుండ మాత్రం పగుల లేదు. బాలవర్థిరాజు స్నేహితులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఆ పడుచుకు మాత్రం చాలా కోపం వచ్చింది. విసురుగా బాలవర్థిరాజు దగ్గరకు వచ్చి “ఇదిగో యువరాజా! నీ ప్రతాపాన్ని ఇలా కుండలమీద కాదు.. నీ తండ్రినీ, తాతను, పెత్తండ్రుల్నీ బండలగా చేసి, మీ అమ్మను బంధీగా ఉంచాడే.. ఆ మాయలఫకీరు మీద చూపించు” అంది. ఆ మాటలకు విస్తుపోయాడు బాలవర్థిరాజు. “ఏమిటీ! నా తల్లి బంధీగా ఉందా? నా తండ్రి, పెత్తండ్రులు బండలైపోయారా? ఎవడా మాయలఫకీరు? ఎక్కడ ఉంటాడు వాడు?” అని ఆమెపై ప్రశ్నలవర్షం కురిపించసాగాడు. ఆవేశంలో నిజం బయటకు చెప్పేసినందుకు కంగారు పడిపోయిందా పడుచు. “మన్నించండి యువరాజా! ఆవేశంలో ఏదో వాగేసాను. ఈ విషయం రాణీగార్లకు తెలిస్తే నా పీక ఉత్తరించేస్తారు. మీరే నన్ను రక్షించాలి. మీరు నన్నేమీ అడగలేదు. నేను మీకేమీ చెప్పలేదు” అని కంగారుగా చెప్పి పరుగుపరుగున అక్కడనుండి వెళ్ళిపోయింది.
Rajan PTSK
FaceBook: - https://www.facebook.com/rajanptsk
Quora: - https://te.quora.com/profile/Rajan-PTSK
#RajanPTSK #Balanagamma #MayalaPakeer#Ajagava